పులివెందుల మేజర్ న్యూస్ : బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పులివెందులలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహం-1 మరియు 2 లలో శనివారం ఉచిత దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి (డిప్యూటీ డీఎంహెచ్ఓ) డాక్టర్ ఖాజా మౌనద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) చింతామణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*ఈ సందర్భంగా డాక్టర్ ఖాజా మౌనద్దీన్ మాట్లాడుతూ..* దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర సీజనల్ వ్యాధుల బారి నుండి విద్యార్థులను కాపాడేందుకే ప్రభుత్వం ఈ దోమతెరలను అందిస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ రాత్రి తప్పనిసరిగా దోమతెరలను వినియోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ ఖాజా మౌనద్దీన్ సూచించారు.
*డిప్యూటీ డైరెక్టర్ చింతామణి మాట్లాడుతూ..* వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమానికి, ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, అందించిన దోమతెరలను సద్వినియోగం చేసుకుని చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు డిప్యూటీ డైరెక్టర్ చింతామణి పిలుపునిచ్చారు.
*సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య మాట్లాడుతూ..* వసతి గృహాల పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సిద్దయ్య కోరారు.
*వసతి గృహ సంక్షేమ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ..* విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దోమతెరలు పంపిణీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులందరూ వీటిని క్రమం తప్పకుండా వాడేలా పర్యవేక్షిస్తామని ప్రసాద్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి శిరీష, సీనియర్ అసిస్టెంట్ నరేష్, వసతి గృహ సంక్షేమ అధికారులు విక్టర్, రవీంద్రబాబు, ప్రభాకర్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, ఆరోగ్య కార్యకర్తలు శేషగిరి నాయక్, సునీత, ఆశా కార్యకర్త రమీజా తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్: కృష్ణ, పులివెందుల.