పాత వేమవరంలో టీడీపీలోకి జనసేన నాయకుడి చేరిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాదల వీరయ్య చౌదరి
వత్సవాయి, నవంబరు 15:
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పాత వేమవరం (రేగులగడ్డ) గ్రామంలో జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాజకీయ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది.
పాత వేమవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు మాదల వీరయ్య చౌదరి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, వత్సవాయి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు.
జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో మాదల వీరయ్య చౌదరికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేమవరం గ్రామంలో చోటుచేసుకుంటున్న ఈ రాజకీయ చేరికలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.