పాత బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల నిల్వలు
శామీర్‌పేట, మేజర్ న్యూస్: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట గ్రామంలో ఆదివారం ఉదయం పాత బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 7:30 గంటల సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, జీనోమ్ వ్యాలీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో నిల్వ ఉంచిన పాత బట్టల స్టాక్ పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తినష్టం సంభవించింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసి అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.