జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంజాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రం కడియం శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. గ్రంథాలయాధికారి ఎం. వీరలింగం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు, సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి వారోత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయాన్ని సందర్శించి వివిధ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచనా శక్తి పెంపొందుతాయని తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం రైస్ మిల్లు యజమాని ఉప్పులూరి హనుమంతరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులకు విజ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు. పుస్తక పఠనంతో పాటు పుస్తక సమీక్షలు, వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 108 మంది, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.