విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి
కొత్తగూడెం కార్పొరేషన్, సూర్య(మేజర్ న్యూస్)- ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పుస్తకాల పురుగులుగా మారుతున్నారని, అలా కాకుండా సాంస్కృతిక పోటీల్లో,క్రీడల్లో రాణించినప్పుడే వారు మానసిక ఉల్లాసంగా ఉంటారని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.కొత్తగూడెం పట్టణంలోని సిఈఆర్ క్లబ్ నందు శనివారం భద్రాద్రి ఫిలిం ఛాంబర్ వారి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల టాలెంట్ షో-2 పోటీలకు ముఖ్య అతిథిగా కామేష్ హాజరై డాన్స్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. అనంతరం కామేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం పుస్తకాలకే పరిమితం చేస్తున్నారని అన్నారు.ఇలా చేయడం వల్ల వారిలో దాగి ఉన్న కళలను బయటకు తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభను గుర్తించి,వారికి తగిన శిక్షణను ఇస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు. డ్యాన్స్ పోటీలకు విచ్చేసిన చిన్నారులను చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా చిన్నారులు అద్భుతంగా తమ నృత్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. కొత్తగూడెం కళాకారులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. టాలెంట్ షో 1వ సిరీస్ వల్లే 2వ సిరీస్ పోటీలు చాలా చక్కగా నిర్వహించిన డాన్స్ మాస్టర్ ప్రభురాజ్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా తంబీ రాజ్, శ్యామల, గీత లు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో తాటిపల్లి శంకర్,పిడుగు శ్రీను,డాక్టర్ లక్ష్మీ,తెరాలా లక్ష్మీ, భద్రం, పుష్కల్,కమల,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.