కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి
గన్నవరం, మేజర్ న్యూస్ : ఈ నెల 16వ తేదీన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో, వారి పర్యటనకు సంబంధించి భద్రత, ప్రోటోకాల్, రవాణా, వైద్య సహాయం తదితర అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
భద్రత, వైద్య సేవలు, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
విమానాశ్రయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ విధులు, రవాణా సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య సిబ్బందితో కూడిన అంబులెన్సులు, అవసరమైన సంఖ్యలో వైద్య బృందాలు, వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు సహా అన్ని అత్యవసర సేవల వాహనాల ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అంబులెన్సుల్లోని వైద్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా, స్ట్రెచర్‌ను సులభంగా బయటకు తీసే అవకాశం ఉందా అనే అంశాలను పరిశీలించి నిర్ధారించుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని, మంత్రి ప్రయాణించే మార్గంలో రోడ్డు పనులు, స్పీడ్ బ్రేకర్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో పర్యటన ఉండే అవకాశం ఉన్నందున జాతీయ రహదారులతో పాటు అన్ని మార్గాల్లో వీధి దీపాలు, హైవే లైట్లు నిరంతరం వెలిగేలా జాతీయ రహదారుల సంస్థ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యత
జిల్లా పంచాయతీ అధికారి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో విమానాశ్రయం నుంచి మంత్రి పర్యటించే మార్గమంతటా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో ఎక్కడా చెత్త కుప్పలు కనిపించకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆహార భద్రతకు సంబంధించి జిల్లా సరఫరాల అధికారి (డీఎస్వో) సమన్వయంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించాలని సూచించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పాములు పట్టే సిబ్బందిని అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పాస్‌లు, ప్రోటోకాల్ నిబంధనల అమలులో అప్రమత్తత
గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి పాస్‌ల జారీ, నిర్వహణకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రాక్సిమిటీ పాస్‌లు అర్హులైన వారికి అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. లగేజీ నిర్వహణ సిబ్బంది తప్పనిసరిగా టికెట్, గుర్తింపు కార్డు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. వీఐపీలకు అందించే పుష్పగుచ్ఛాలు, పూలమాలలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
భద్రతా తనిఖీలు ముమ్మరం చేయాలి : జిల్లా ఎస్పీ
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ, మంత్రి పర్యటించే మార్గంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సూచించారు. వాచ్ టవర్ల వద్ద నిఘా, తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. మంత్రి ప్రయాణించే మార్గంలోని భవనాలు, హెచ్‌సీఎం బిల్డింగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని భవనాలను పూర్తిస్థాయిలో గుర్తించి ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. భవనాలపై, కింద ఉన్న వాటర్ ట్యాంకులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి భద్రతా సిబ్బంది వికాస్ కుమార్ సింగ్, సి. కణ్ణన్, నితీష్ భడోరియా, రంజన్ మొహంతి, అమిత్ కుమార్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.