సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
కృష్ణలంక, మేజర్ న్యూస్ : స్థానిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సందడి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వరలక్ష్మి, ప్రిన్సిపాల్ రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన దశ అని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెంపొందుతాయని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, మంచి నడవడికతో ఉన్నత లక్ష్యాలను చేరుకుని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.