మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, మేజర్ న్యూస్ : మచిలీపట్నం నగరంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్, సాయిబాబా సెంటర్, బందరు బస్టాండ్ సెంటర్, కోనేరు సెంటర్, కోర్టు రోడ్డు తదితర ప్రధాన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షాలు కురిసిన అనంతరం మురుగునీరు, వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి రెండు మూడు రోజుల వరకు కూడా బయటకు వెళ్లని పరిస్థితులను గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని, పూడిక పేరుకుపోయిన కాలువలను యుద్ధ ప్రాతిపదికన శుభ్రపరచాలని ఆదేశించారు. వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా ప్రధాన డ్రైనేజీ మార్గాల్లో అడ్డంకులను తొలగించి, నీటి నిల్వల సమస్యకు పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్‌లకు స్పష్టం చేశారు. డ్రైనేజీల పూడికతీత, నీటి నిల్వల తొలగింపునకు అవసరమైన ఆధునిక యంత్రసామగ్రి, సాంకేతిక నిపుణుల కొరతను అధిగమించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి, అవసరమైన యంత్రసామగ్రితో పాటు సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన పంపించాలని కోరారు. దీనిపై విజయవాడ కమిషనర్ సానుకూలంగా స్పందించి, అవసరమైన యంత్రసామగ్రి, సాంకేతిక నిపుణులను మచిలీపట్నంలో పనులు చేపట్టేందుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ప్రస్తుతం నెలకొన్న డ్రైనేజీ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కల్పించడంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని కలెక్టర్ సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించి, అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరమ్మతులు, పూడికతీత పనులకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, నగర ప్రజల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్, ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.