నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ
గుడివాడ, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు, పక్షపాతానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా గుడివాడ పురపాలక సంఘంలోని 48 వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో శనివారం కలెక్టర్ పట్టణంలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో 48 వార్డులకు ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి, అక్కడి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి నామినేషన్ ఛాంబర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన పోలీసు బందోబస్తు కల్పించామని వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ విధులు నిర్వహించే ఎన్నికల అధికారులందరికీ నిబంధనలు, విధివిధానాలపై సమగ్ర శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రతి నామినేషన్‌ను నిష్పక్షపాతంగా స్వీకరించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు లేదా ఇతరులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఎదురైతే నేరుగా మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ మనోహర్ రావు, ఎన్నికల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.