రబీలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత.. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మధు
సూర్య, సిర్పూర్ (టి):- ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు, నీటి లభ్యత లో అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని రబీ సీజన్ లో రైతులు వరి సాగును నివారించి, పంటల వైవిధ్యీకరణ కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మధు తెలిపారు .మండలంలోని పారిగాం గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మధు కంది పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కంది పంటలో మెరుగైన దిగుబడి కోసం సిఫార్సు చేసిన పంట యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, కలుపు నివారణ, చీడపీడల యాజమాన్యం తదితర అంశాలపై రైతులకు సూచనలు అందించారు.రబీలో అధిక నీటి అవసరమున్న వరికి బదులుగా కంది, శనగ, పెసలు, మినుములు, జొన్న, నువ్వులు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గిరీశన్, వ్యవసాయ విస్తరణ అధికారి రవి కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.