పువ్వుల పండుగకు పులకించిన హుస్నాబాద్!
హుస్నాబాద్ ; హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, అక్కాచెల్లెళ్లు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఎల్లమ్మ చెరువు కట్టపైకి తీసుకువచ్చి, ఆటపాటలతో సందడి చేశారు.
ఆటపాటలతో హోరెత్తిన చెరువు కట్ట:
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. ‘వెళ్లిరావే గౌరమ్మ.. వెళ్లిరావమ్మ గౌరమ్మ’ అంటూ గౌరమ్మకు వీడ్కోలు పలికారు. అనంతరం బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి గౌరమ్మను భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగనంపారు. దీంతో ఎల్లమ్మ చెరువు కట్ట మహిళల కోలాహలం, పండుగ సందడితో కళకళలాడింది.
అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక:
సద్దుల బతుకమ్మ పండుగ అక్కాచెల్లెళ్ల ఆత్మీయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ వేడుకలు చాటిచెప్పాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడారు. పూలతో పేర్చిన బతుకమ్మల అందాలు, మహిళల సంప్రదాయ పాటలు, ఆటలతో పండుగ వాతావరణం నెలకొంది.ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సద్దుల బతుకమ్మ సంబరాలతో హుస్నాబాద్ పట్టణంలో పండుగ శోభ వెల్లివిరిసింది. ఈ వేడుకలలో పురపాలక సంఘం చైర్పర్సన్ దండి లక్ష్మి వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ కౌన్సిలర్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వెంకటరమణ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె డమ్ లింగమూర్తి మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు