జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
మచిలీపట్నం మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, వివిధ విభాగాల అధికారుల సన్నద్ధతపై జిల్లా సాధారణ పరిశీలకుడు కె.వి.ఎన్. చక్రధర్‌బాబు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ సంయుక్తంగా జిల్లా స్థాయి నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకుడు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ మరింత క్లిష్టమైనదని, ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా, సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల కోసం ఇప్పటివరకు 632 మంది గెజిటెడ్ అధికారులు, 3,271 మంది ఇతర అధికారులు, 7,275 మంది నాన్ గెజిటెడ్ అధికారులు, సిబ్బందిని గుర్తించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తొలి విడత సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని, రెండో విడత కేటాయింపులను అక్టోబర్ 21న చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎన్నికల విధులకు నియమితులయ్యే సిబ్బందికి జారీ చేసే ఉత్తర్వుల్లోనే శిక్షణ వివరాలను పొందుపరచాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు అవసరమైన వాహనాలు, బస్సులను సిద్ధం చేసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై అందే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి, విచారణ అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఏర్పాటు చేసి, వాటి వివరాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పోలింగ్ సామగ్రి సేకరణ, కొనుగోలు, నిల్వ, పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట సూక్ష్మ పరిశీలకులను నియమించాలని, వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వీల్‌చైర్లు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారం క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎప్పటికప్పుడు చేరేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది హాజరు, రవాణా తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి సమష్టిగా కృషి చేయాలని సాధారణ పరిశీలకుడు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్‌రెడ్డి, జిల్లా స్థాయి నోడల్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.