స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
విజయవాడ మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల నియమావళి, ప్రచార నిబంధనలు, ఎన్నికల వ్యయ పరిమితులపై వివరించారు. కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో ఓట్లు అడగడం, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రత్యర్థులపై అసత్య ఆరోపణలు చేయడం నేరమన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయరాదని, ప్రైవేటు స్థలాల్లో ప్రచార సామగ్రి ఏర్పాటు చేయాలంటే యజమాని లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలు, నిధులను ఎన్నికల ప్రచారానికి వినియోగించరాదని, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రాంగణాల్లో ప్రచారం నిషిద్ధమని తెలిపారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, లౌడ్స్పీకర్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని, మైకులను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమాల నిరోధానికి నిఘా బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. అభ్యర్థులు రోజువారీ ప్రచార ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేస్తూ నిర్ణీత వ్యయ పరిమితులకు లోబడి ఖర్చు చేయాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి వ్యయ పరిమితి రూ.25 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.10 లక్షలు కాగా, మున్సిపాలిటీల చైర్పర్సన్ అభ్యర్థులకు రూ.20 లక్షలు, వార్డు సభ్యులకు రూ.7.50 లక్షలు, నగర పంచాయతీల చైర్పర్సన్ అభ్యర్థులకు రూ.10 లక్షలు, వార్డు సభ్యులకు రూ.5 లక్షలుగా నిర్ణయించినట్లు వివరించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఓటర్లు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం, జిల్లా పరిషత్ సీఈఓ పి. సుశీల, జిల్లా పంచాయతీ అధికారి సీతా మహాలక్ష్మి, విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎ. రవీంద్రరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.