కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా
మచిలీపట్నం మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ తెలిపారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడిస్తూ, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని 26 మండలాల్లో 26 జడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 1,266 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, మొత్తం 9,98,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 21న ఎన్నికల నోటీసు జారీ చేసి, 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ, 26న అప్పీళ్ల పరిష్కారం చేపడతారు. 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే 4న రీపోలింగ్ నిర్వహించి, 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, ప్రత్యేక సమావేశాలను నవంబర్ 11 లేదా 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.