దసరా మెగా కార్నివాల్.. విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు
విజయవాడ మేజర్ న్యూస్ : దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 20న విజయవాడలోని ఏలూరు రోడ్డులో మెగా కార్నివాల్ నిర్వహించనున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి చుట్టుగుంట సిగ్నల్ జంక్షన్ మీదుగా విశాలాంధ్ర రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం వరకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో నగర పోలీసు శాఖ ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి ఆర్టీసీ నగర బస్సులను పాక్షికంగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా దారి మళ్లించనున్నారు. రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా వచ్చే బస్సులను పడవలరేవు జంక్షన్, బీఆర్‌టీఎస్‌రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, నారాయణస్వామి హోటల్, పాత కేశినేని ట్రావెల్స్, స్వర్ణ ప్యాలెస్, పీసీఆర్ జంక్షన్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు మళ్లిస్తారు. బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు వైపు వెళ్లే బస్సులను ఇదే మార్గంలో వెనక్కి మళ్లించడంతో పాటు ప్రత్యామ్నాయంగా పీసీఆర్ జంక్షన్, ఆర్టీసీ వై జంక్షన్, ఎంజీ రోడ్డు, బెంజ్ సర్కిల్, మహానాడు జంక్షన్ మీదుగా రామవరప్పా డు రింగ్ వైపు పంపిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏలూరు రోడ్డులో దీప్తి జంక్షన్ నుంచి పడవలరేవు జంక్షన్ వరకు, అలాగే పడవలరేవు జంక్షన్ నుంచి దీప్తి జంక్షన్ వైపు కార్లు, ద్విచక్ర వాహనాలు సహా ఇతర వాహనాలను అనుమతించరు. ప్రజలు ప్రత్యామ్నాయమార్గాల్లో ప్రయాణించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని ఎన్‌టీఆర్ పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం డీసీపీ విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.