76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : విజయవాడ 76వ డివిజన్ రామకృష్ణాపురంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గాదిరాజు శ్రీనివాసరాజు గెలుపును కాంక్షిస్తూ సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ప్రచారంలో భాగంగా స్థానికులను కలుసుకుని కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందించడంతో పాటు పింఛన్లు, ఇంటి పట్టాల మంజూరులో సహకరిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి అర్హులకు ఆర్థిక భరోసా కల్పించారని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నగర అభివృద్ధి, సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ చైర్మన్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, క్లస్టర్ ఇన్‌చార్జి ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షుడు లక్కం రాజు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి భద్రం, ఇన్‌చార్జి కర్ణం వెంకటరమణ, నాగమణి, వెలగపూడి శ్రీను, కోనేరు అనురాధ తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.