ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులపై దౌర్జన్యం నెలవారీగా ఒక్కొక్కరు రూ. 1500 ఇవ్వాలని డిమాండ్
నేరేడుచర్ల మేజర్ న్యూస్ :నేరేడుచర్ల పట్టణంలోని జానపాడు రోడ్డు పక్కన ఎన్ఎస్పి క్యాంపు స్థలం ముందు ఫుట్పాత్ పై కూరగాయల వ్యాపారం చేస్తున్న తమపై పాలకవీడు మండలం చెరువు తండా చెందిన నాగు నాయక్ అనే వ్యక్తి ఈ స్థలము తనదని నెలకు ఒక్కొక్కరు
రూ.1500 చొప్పున ఇవ్వాలని తమపై దౌర్జన్యం చేసి కూరగాయలను నేలపాలు చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగు నాయక్ గత రెండు వారాల నుండి ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే ఒక్కొక్కరు నెలకు రూ.1,500 చెల్లించాలని, లేకపోతే వ్యాపారం చేయనివ్వబోమని బెదిరిస్తున్నట్లు తెలిపారు.
తాము విక్రయించేందుకు తెచ్చుకున్న కూరగాయలను కింద పడేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని వ్యాపారులు గుంజ సతీష్, ఉప్పెల్లి స్వప్న, బొల్లా శ్రీను ఆరోపించారు. రోజువారీ వ్యాపారంతో కుటుంబాలను పోషించుకుంటున్న తమను నెలవారీ డబ్బుల కోసం వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
*మున్సిపల్ కమిషనర్ వివరణ*
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ నాగరాజు ను వివరణ కోరగా వీధి వ్యాపారులపై దౌర్జన్యం చేసి అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఫుట్ పాత్ వెనుక భాగంలో ఉన్న స్థలములో గతంలో ఎన్ఎస్పి క్వార్టర్స్ నిర్మించారు. ఆ స్థలములో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయము నిర్మించాలని, గతంలో శంకుస్థాపన చేయగా,అది ప్రభుత్వ స్థలం కాదని ప్రైవేటు వ్యక్తుల స్థలమని కోర్టులో వివాదం నడుస్తుంది. వివాదంలో ఉన్న ఆ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని ఆ స్థలం ముందు ఫుట్బాత్ పై కూరగాయలు, అమ్మితే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కూరగాయ వ్యాపారస్తులు తెలిపారు. ఈ విషయంపై నాగు నాయక్‌ను ఫోన్‌లో సంప్రదించగా మా బంధువు కలెక్టర్ ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని దురుసుగా సమాధానం చెప్పాడు. తాను ఇతర వ్యక్తుల వద్ద ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.