సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి ; స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, ప్రసంగాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో పలు ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రతి బాల్యంలోనూ అద్భుతమైన భవిష్యత్తు దాగి ఉంటుందని, ప్రతి చిన్నారి సమాజానికి ఆశాకిరణమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, మానవీయ విలువలను నేర్పించడం ద్వారా పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బందిని పాఠశాల కరస్పాండెంట్ కె. ఆంథోని రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.