13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్
తెలంగాణ బ్యూరో ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకు అడ్డంకిగా ఉన్న క్రిమిలేయర్ నిబంధనను పూర్తిగా తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో ప్రత్యేకంగా ఓబీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ నంబర్ కేటాయించాలని కోరింది. ఈ మేరకు ఆదివారం జరిగిన బీసీ విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు వి. అనురాధ, ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖలకు చెందిన బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు ఉద్యోగ నియామకాల్లో విధిస్తున్న క్రిమిలేయర్ నిబంధన వివక్షాపూరితమని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు, ఇతర వర్గాల రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ నిబంధన బీసీలకు మాత్రమే ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల ఉద్దేశం కేవలం పేదరిక నిర్మూలన కాదని, జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగాలు, పాలనలో తగిన ప్రాతినిధ్యం కల్పించి సామాజిక గౌరవాన్ని పెంపొందించడమేనని స్పష్టం చేశారు. అందుకే బీసీలకు వర్తిస్తున్న క్రిమిలేయర్ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రమోషన్లలో రిజర్వేషన్లకు అడ్డంకులేవీ లేవు
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు లేవని నాయకులు పేర్కొన్నారు. మండల్ కమిషన్, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచియప్పన్ కమిటీ సైతం బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ, 34 సంవత్సరాలు గడిచినా బీసీల ప్రాతినిధ్యం ఆశించిన స్థాయికి చేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల వాటా 17 శాతం దాటలేదని, గ్రూప్-ఏ స్థాయి ఉద్యోగాల్లో 9 శాతం, ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల్లో 7 శాతం కూడా లేదని పేర్కొన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలు ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం పొందగలరని అభిప్రాయపడ్డారు.
జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక కోడ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కులగణనను స్వాగతిస్తున్నామని, అయితే శాస్త్రీయంగా కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించేందుకు ప్రత్యేక OBC కాలమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒకే కులానికి ప్రాంతాలను బట్టి ఐదు, ఆరు రకాల పేర్లు ఉండటంతో లెక్కింపులో గందరగోళం తలెత్తే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ నంబర్ కేటాయిస్తే కచ్చితమైన జనాభా వివరాలు సేకరించడం సాధ్యమవుతుందని సూచించారు.
దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు కులాల వారీగా విడిపోవడం వల్ల తమ న్యాయమైన హక్కులను సాధించుకోలేకపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించి బీసీల సామాజిక న్యాయ పోరాటానికి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. బీసీ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు తమ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. 77 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు పూర్తిస్థాయిలో దక్కకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
13 డిమాండ్లతో తీర్మానాలు
సమావేశంలో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, క్రిమిలేయర్ తొలగింపు, జనగణనలో ప్రత్యేక OBC కాలమ్, ప్రతి కులానికి కోడ్ కేటాయింపు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగాల్లో బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి రిజర్వేషన్ల పెంపు తదితర 13 అంశాలపై తీర్మానాలు ఆమోదించారు.
అలాగే బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీలకు సామాజిక రక్షణ కల్పించే బీసీ చట్టం తీసుకురావడం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను సంతృప్త స్థాయిలో అమలు చేయాలని, ఇందుకు రాష్ట్రాలకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తీర్మానించారు.
బీసీల హక్కుల సాధన కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని సమావేశం పిలుపునిచ్చింది.