కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.
కావలి, మేజర్ న్యూస్ : కావలి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. స్థానిక రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి.
కూటమి అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్:
మొన్నటి వరకు కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ పేరు వినిపించినప్పటికీ, అనూహ్య పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్‌ను ఏకగ్రీవంగా తమ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భరత్ కుమార్ యాదవ్ గతంలో ఇన్‌చార్జ్ మున్సిపల్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. అంతేకాకుండా, ఆయన గతంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.
వైఎస్సార్‌సీపీ తరఫున కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి:
మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్‌పర్సన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి బరిలో నిలిచారు. కావలి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడిగా, యానాదిరెడ్డికి సమీప బంధువుగా మరియు దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డికి స్థానికంగా గుర్తింపు ఉందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
క్షేత్రస్థాయి పరిస్థితులు – విశ్లేషకుల అంచనాలు:
పట్టణంలో మెజారిటీ వార్డులలో గెలుపు కోసం ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయావకాశాలపై ఆ పార్టీ వర్గాలు, కొందరు స్థానిక మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు కూటమిలో కింది స్థాయి కార్యకర్తల మధ్య ఉన్న కొన్ని అభిప్రాయ భేదాలు, చైర్మన్ మరియు కౌన్సిలర్ స్థానాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న ఈ పోటీ నేపథ్యంలో, కావలి పురపాలక పీఠాన్ని ఏపార్టీ కైవసం చేసుకుంటుందో తెలియాలంటే ఓటర్ల తీర్పు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.