సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్చెరు.. భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామా!
పటాన్చెరు:భిన్న భాషలు,విభిన్న ప్రాంతాలు,అనేక సంస్కృతులు, సంప్రదాయాలకు సముచిత గౌరవం కల్పిస్తూ సబ్బండ వర్గాల ఐక్యతకు పటాన్చెరు నియోజకవర్గం ప్రతీకగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించడం, వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం తెలంగాణ ప్రజల గొప్ప సంస్కారమని పేర్కొన్నారు. పటాన్చెరు ప్రాంత అభివృద్ధిలో ప్రతి వర్గం ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే పవిత్ర ఛట్ పూజా మహోత్సవాలు ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు వేదికగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, జాగరణ కార్యక్రమాలు వేలాది మంది ఉత్తర భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఛట్ పూజ కోసం సాకి చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకల్లో ప్రముఖ భోజ్పురి గాయకుడు రితేష్ పాండే, గాయని కావ్య తమ సంగీత ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారి మధురమైన గాత్రంతో ఆలపించిన పాటలకు ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించారు. వేలాదిగా తరలివచ్చిన ఉత్తర భారతీయులు సంగీత విభావరిని ఆస్వాదించారు. జై ఛట్టి మయ్య, ఛట్ మయ్య కీ జై నినాదాలతో మైత్రి మైదానం మార్మోగిపోయింది. పండుగ సందడి పటాన్చెరు పట్టణంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి, ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది పటాన్చెరు ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. స్థానిక ప్రజలతో కలిసి వారు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తామని, కులం, మతం, ప్రాంతం, భాష అనే తేడాలు లేకుండా అందరికీ సమాన గౌరవం కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తర భారతీయుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి సమస్యలు, అవసరాల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఛట్ పూజ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, సూర్యభగవానుడిని ఆరాధిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయమని అన్నారు. కుటుంబాల ఆరోగ్యం, సుఖసంతోషాల కోసం భక్తులు ఎంతో నియమనిష్ఠలతో ఈ పూజలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు.గత 20 సంవత్సరాలుగా పటాన్చెరు వేదికగా ఛట్ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల పండుగలు, సంస్కృతి సంప్రదాయాలకు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, సామాజిక సామరస్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు, భక్తులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.