సూర్య, సెంటినరీకాలనీ :సింగరేణి భూసేకరణతో ప్రభావితమైన కుటుంబాలతో పాటు మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత, మహిళలకు ఐటీ రంగంలో నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో స్థానికంగా ఐటీ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో జీఎం సుంకర మధుసూదన్‌తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ లైజాన్ అధికారి అంజన్ కుమార్, ఐటీ ప్రతినిధి ఇజ్జగిరి రాజు సమావేశమై శిక్షణ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. సింగరేణి భూసేకరణతో ప్రభావితమైన కుటుంబాల నిరుద్యోగ యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహించనున్నారు. ఐటీ రంగానికి చెందిన నిపుణుల ద్వారా శిక్షణ అందించి, శిక్షణ పూర్తి చేసిన వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. స్థానిక యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగ అర్హతలను మెరుగుపరచడం తో పాటు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానికంగానే నైపుణ్య శిక్షణ అందుబాటులోకి వస్తే సింగరేణి ప్రభావిత కుటుంబాలతో పాటు మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.