20 రోజుల తర్వాత స్వగ్రామానికి గంగాధర్ మృతదేహం - నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల వేడుకోలు
సూర్య కమ్మర్‌పల్లి : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్ అలియాస్ రాజు మృతదేహం 20 రోజుల తర్వాత స్వదేశానికి రానుంది. గత నెల అక్టోబర్ 28న దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర్ దుర్మరణం పాలయ్యారు.ఆయన మృతదేహాన్ని ఆదివారం దుబాయ్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలిస్తున్నారు. సోమవారం ఉదయం 5:00 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి మృతదేహం చేరుకుంటుంది. అక్కడి నుండి ఉదయం 10:00 గంటల వరకు స్వగ్రామమైన హాసాకొత్తూర్‌కు పార్థివదేహం చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడు గంగాధర్‌కు (36) అతనికి భార్య అరుణ,కూతురు శ్రీనయ ఉన్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.