సూర్య, వేములవాడ: కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, నిత్యకల్యాణం, చండీ హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం, కుంకుమ పూజ తదితర ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు.కార్తీక మాస విశిష్టతను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గండ దీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, అన్నప్రసాద సత్రంలో భోజనం చేశారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ కుమార్ క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు.