telangana
18 నుండి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన
సూర్య, హుజురాబాద్:హుజురాబాద్ పట్టణ శివారులోని బోర్నపల్లి రోడ్ లో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈనెల 18 నుండి 20వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటి అధ్యక్షులు దొంత రమేష్, ప్రధాన కార్యదర్శి అంగీరక రాజేంద్రప్రసాద్ లు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ.... ఈనెల 18న గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ హోమం, సప్తాహవచనం, జలాధివాసం, అధర్వణ శీర్ష హోమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 19న మంటప పూజలు, మహాగణపతి హోమం, అష్టదిక్పాలక హోమం, సూక్త హోమం, స్వస్తివాచనం, దీపారాధన, కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 20న కుక్కే సుబ్రహ్మణ్య మఠం శ్రీ జగద్గురు మధ్వాచార్య మూల మహాసంస్థానం ఆచార్యులు డాక్టర్ విద్యా ప్రసన్న తీర్థ స్వామిచే యంత్రస్థాపన, శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. ఈ సందర్భంగా పంచామృతాభిషేకం, పూర్ణాహుతి హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా వేద పండితులు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాలను విద్యా ప్రసన్న తీర్థ స్వామితో పాటు రవణాచార్య, పందిళ్ళ భాస్కర్ శర్మలు నిర్వహిస్తారని అన్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్ లతో పాటు పలువురు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ లు హాజరవుతారని అన్నారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కార్యంలో పాల్గొనాలని వారన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటి సభ్యులు క్యాస చక్రధర్, మాసాడి రవీందర్ రావు, శనిగరపు నరేందర్, సందమల్ల బాబు, కుసుంబ సంపత్ రావు, కమల్ కుమార్ లు పాల్గొన్నారు.