ఓటీటీలోకి వచ్చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ 'క్రేజీ కల్యాణం'.. ఆహాలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ కల్యాణం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు బద్రప్ప గాజుల తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైంది. అనుపమతో పాటు సీనియర్ నటుడు వీకే నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, కిరీటి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగానే నవ్వించింది. అయితే పండగ బరిలో భారీ చిత్రాల పోటీ ఉండటంతో థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయనుంది.
క్రేజీ కల్యాణం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం అధికారిక స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. నవంబర్ 20వ తేదీ శుక్రవారం నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.
యూరో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర కథ వినోదాత్మకంగా సాగుతుంది. మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు తన పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకుంటాడు. అయితే అల్లుడు బాల రాజు నిత్యం మద్యం సేవిస్తూ ఊర్లో గొడవలు చేస్తూ కుటుంబ పరువు తీస్తుంటాడు. దీంతో చిన్న కూతురు కీర్తికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తన పరువు కాపాడుకోవాలని పర్వతాలు భావిస్తాడు. కానీ కీర్తి తనతో పాటు కాలేజీలో చదువుకునే ఉదయ్‌ను ప్రేమిస్తుంది.
జీవితంలో స్థిరపడిన తర్వాత ఇంట్లో ప్రేమ విషయం చెప్పాలని కీర్తి అనుకుంటుండగా, తండ్రి ఆమెకు ఒక అమెరికా సంబంధం ఖాయం చేస్తాడు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు, తండ్రీకూతుళ్ల మధ్య నడిచే భావోద్వేగాలు, వినోదభరిత సన్నివేశాలతో ఈ సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన సినీ అభిమానులకు నవంబర్ 20 నుంచి ఆహా ఓటీటీలో మంచి వినోదం లభించనుంది.
Also Read: తుఫాను వస్తోంది... అప్రమత్తంగా ఉండాలి