andhrapradesh
జనసేనలో కష్టపడిన కార్యకర్తకు గుర్తింపు కరువేనా?
నరసరావుపేట న్యూస్: పార్టీ కోసం రెండు దశాబ్దాలుగా కష్టపడుతున్న కార్యకర్తకు గుర్తింపు దక్కడం లేదంటూ జనసేన శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పట్టణంలోని మిట్టబజార్ 44వ వార్డుకు చెందిన గుప్తా శ్రీకాంత్ ప్రజారాజ్యం, జనసేన పార్టీల తరఫున గత 20 ఏళ్లుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని స్థానిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే, చివరి నిమిషంలో 44వ వార్డు బీ-ఫామ్ కేటాయింపు విషయంలో ఆయనను పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నా యన్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశ మైంది. మరో వార్డుకు చెందిన వ్యక్తికి ఇక్కడ టికెట్ కేటాయించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తూ ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వకపోతే కార్యకర్తల్లో విశ్వాసం ఎలా నిలుస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా పనిచేసిన నాయకులను పక్కనపెట్టి ఇతరులకు అవకాశం కల్పించాలనే నిర్ణయం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అధిష్ఠానం స్పందించి, స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. గుప్తా శ్రీకాంత్ సేవలను గుర్తించి 44వ వార్డు బీ-ఫామ్ కేటాయించాలని జనసైనికులు, స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, న్యాయం కల్పించాలని స్థానిక శ్రేణులు కోరుతున్నారు.