గుర్తింపు' ఎప్పుడు... గోవిందా....! -టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై కనికరం చూపండి సారూ... -ఐడీ కార్డులు, మెడికల్, లడ్డుకార్డుల జారీలో జాప్యమెందుకో... -పాలకమండలి నిర్ణయించినా అమలు చేయడంలో నిర్లక్ష్యమా...!
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలలో 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తాత్కాలిక ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని ఏళ్లుగా టీటీడీ యాజమాన్యానికి బోధన, బోధనేతర సిబ్బంది మొరపెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 5వ తేదీన జరిగిన పాలకమండలి సమావేశంలో తాత్కాలిక ఉద్యోగులకు గుర్తింపు కార్డులు, లడ్డు కార్డులు, మెడికల్ కార్డులతో పాటు మూడు నెలలకు ఒక్కసారి శుభదం దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయించారు. సమావేశంలో నిర్ణయించి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. టీటీడీలో పనిచేస్తున్న కొంత మంది తాత్కాలిక ఉద్యోగులకు మాత్రమే అందుతున్నా మిగిలిన వారికి ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
—దేవుడు వరమిచ్చినా.…
దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించడం లేదనే చందంగా మారింది. టీటీడీలో పనిచేస్తున్న కొందరి తాత్కాలిక ఉద్యోగుల పరిస్థితి. పాలకమండలి నిర్ణయం తీసుకుని ఆరునెలులు గడిచినా ఇప్పటి వరకు వారికి బోర్డు నిర్ణయించిన సదుపాయాలు అందలేదని వాపోతున్నారు. ఈఓ గతనెల 27వ తేదీ పాలకమండలి తీర్మానానికి ఆమోదం తెలిపినా ఆ దిశగా ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులోకి రాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఉత్తర్వులు మేరకు అర్హులైన టైమేస్కేల్, ఔట్సోర్సింగ్, సోసైటీ సిబ్బంది, తాత్కాలిక ఉద్యోగులకు క్యూఆర్ కోడ్తో ఐడెంటిటీ కార్డులు, నెలకు 10 సబ్సిడీ లడ్డులు, ఉద్యోగితో పాటు కుటుంబసభ్యులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం, హెల్త్ కార్డులు జారీ చేసి తమను ఆదుకోవాలని టీటీడీలోని బోధన, భోదనేతర సిబ్బంది అధికారులను వేడుకుంటున్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్