telangana
పేదల నిరీక్షణకు తెరపడేనా...!? -- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జాప్యం
సూర్య, హుజురాబాద్:హుజురాబాద్ పట్టణ శివారులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఏండ్లు గడుస్తున్న.... వాటి పంపిణీ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ నిర్లిప్తతను వీడి వాటిని పంచడానికి ఇకనైనా ముందుకు వస్తారేమోనని అర్హులైన లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలని ఉద్దేశంతో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి 2016లో శ్రీకారం చుట్టింది. 2018 వరకు వాటి నిర్మాణాలు పూర్తయ్యాయి. మొత్తం 13 బ్లాక్లుగా ఉన్న డబుల్ బెడ్ రూములు 500 ఇండ్లను అధికారులు నిర్మించారు.
-- పంపిణీలో జాప్యం....
హుజురాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంకు రెండేళ్లు పట్టినప్పటికి నిర్మించిన ఇండ్లను పంపిణీ చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతుంది. అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ హయాంలో ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత కాలం నుండి అర్హులైన పేదలకు పంచడానికి అనేక రకాల అడ్డంకులు వచ్చాయి. ఉప ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ లను పంచాలని అధికారులు ప్రయత్నించేటప్పటికి ఆ పని పూర్తి కాలేదు. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఆయన తర్వాత ఇండ్ల పంపకం చేపట్టాలని ప్రయత్నించిన పంపిణీ జరగలేదు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైనా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి ముహూర్తం దొరకడం లేదు. పంపిణీ చేయాలన్న ప్రతిసారి అర్హుల జాబితాలు రూపొందించడం, జాబితాపై పలువురు అభ్యంతరాలు చెప్పడం, అధికారులు తిరిగి మళ్లీ జాబితాలను రూపొందించడం చేస్తున్నారు. ఇలా జాబితాలు ఇప్పటి వరకు ఐదుసార్లు అధికారులు తయారు చేశారు. తాజాగా అధికారులు తయారు చేసిన జాబితాపై కలెక్టర్ కు ఫిర్యాదు పలువురు చేయడంతో తిరిగి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు విచారణ జరిపి జాబితాను రూపొందించారు. కాగా నూతనంగా ఉన్న జాబితాలో పలు వార్డులకు అన్యాయం జరిగిందని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్ లావణ్య తమ వార్డులోని నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వకపోతే పదవికే రాజీనామా చేస్తానని అధికారులను హెచ్చరించారు. అర్హులైన జాబితాను రూపొందించే సమయంలో అధికారులు ఎవరి ఒత్తిడికి లొంగకుండా అర్హులైన నిజమైన పేదవారికి వాటిని అందిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కొన్నేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు వృధాగా ఉన్న వాటిని తొందరగా మరమ్మత్తులు చేసి ప్రజలకు అందించి మేలు చేయాలని పేద ప్రజలు కోరుతున్నారు.