పెంబట్లలో ఒకే రాత్రి మూడు మోటార్లు అపహరణ
సూర్య సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామ పరిధిలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేసినట్లు తెలిసింది. మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని, లక్ష్మీదేవిపల్లి గ్రామ శివారులో పక్కపక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లో ఈ చోరీలు చోటుచేసుకున్నట్లు బాధిత రైతులు తెలిపారు. బొక్కల ప్రవీణ్, కుసరి రాజశేఖర్, చిందం గంగాధర్ అనే రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్ మోటార్లను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో అపహరించినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లి మోటార్లను ఏర్పాటు చేసుకునే సమయంలో అవి కనిపించకపోవడంతో బాధిత రైతులు చోరీ గుర్తించారు.కాగా గురువారం మధ్యాహ్నం సమయంలో ఇదే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినట్లు పలువురు రైతులు గమనించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడి ఉండవచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న సమయంలో మోటార్ల చోరీ రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికే సాగు పనుల కోసం పెట్టుబడులు పెడుతున్న రైతులకు విద్యుత్ మోటార్లు చోరీ కావడం అదనపు భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.