గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆర్టీసీ ఉద్యోగి మృతి... బోరు పైపుల కోసం వెళ్తుండగా మృత్యువాత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
కీసర,మేజర్ న్యూస్ :ఇంట్లో మంచినీటి సమస్యను పరిష్కరించుకునేందుకు బోరు పైపుల కొనుగోలు కోసం వెళ్లిన ఓ ఆర్టీసీ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డుపై పడిన ఆయనకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన శుక్రవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.కీసరకు చెందిన కటికెం సత్యనారాయణ (51) కుందన్‌పల్లిలోని శ్రీరామలింగేశ్వర కాలనీలో భార్య, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇంట్లో మంచినీటి సమస్య ఉండటంతో నాలుగు రోజుల క్రితం కొత్తగా బోరు వేయించాడు. ఇందుకు అవసరమైన పైపులు కొనుగోలు చేసేందుకు శుక్రవారం ద్విచక్ర వాహనంపై నాగారానికి బయలుదేరాడు. ఈ క్రమంలో అహ్మదూడ ఐకాం కంపెనీ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.