రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి
14 మండలాల్లో 1,951 పోలింగ్ కేంద్రాలకు 4,353 మంది సిబ్బంది నియామకం
480 మంది సిబ్బంది రిజర్వ్‌లో.. 250 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో
నెల్లూరు కలెక్టరేట్ మేజర్ న్యూస్
జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెండో విడత ఎన్నికలకు సంబంధించి చివరి ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.
ఆన్‌లైన్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఏ పోలింగ్ కేంద్రానికి ఏ సిబ్బంది విధులు నిర్వహించాలనే విషయాన్ని నిర్ణయించారు.
రెండో విడతలో జిల్లాలోని 14 మండలాల్లో మొత్తం 2,714 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 763 పోలింగ్ కేంద్రాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 1,951 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ కేంద్రాలకు 1,951 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,951 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 389 మంది OPO-1, 62 మంది OPO-2 సిబ్బందిని కలిపి మొత్తం 4,353 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. అదనంగా 480 మంది సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు.
ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు 14 మండలాల్లో 208 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అదనంగా 42 మంది మైక్రో అబ్జర్వర్లను రిజర్వ్‌లో ఉంచడంతో మొత్తం 250 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి, సీపీఓ లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.