రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- ఈ నెల 29న పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలి
- పోలింగ్ ఉ. 7 నుంచి మ.1.00 గంట వరకు
- మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్
- పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం
- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
కాకినాడ, మేజర్ న్యూస్ : రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల నిబంధనల మేరకు ప్రశాంతంగా, పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు,ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియలకు సంబంధించి శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎన్నికల విధులు నిర్వహించే ఇతర అధికారులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండవ విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన ఉ. 7 గంటల నుంచి మ. 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారం భించి పూర్తయ్యే వరకు కొనసాగించాలని తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే నిబంధనల ప్రకారం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ముద్రణ వివరాలను ప్రతి పేజీలో జాగ్రత్తగా తనిఖీ చేయాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సంబంధిత వార్డులకు బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేయాలని సూచించారు.
పోలింగ్ సిబ్బందికి టీ, బిస్కెట్, భోజనం, రాత్రి భోజనం అందించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, ఓటర్ల రహస్య ఓటింగ్, గోప్యతకు సంబంధించిన ఏర్పాట్లు, ఓటింగ్ కంపా ర్ట్‌మెంట్లను తనిఖీ చేయాలని తెలిపారు. ఎన్నికల ఏజెంట్లకు అవసరమైన గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగింపు సమయంలో క్యూలో ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం టోకెన్లు జారీ చేసి, వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ పూర్తయిన అనంతరం సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, వీలైనంత త్వరగా మధ్యాహ్నం 2.00 లేదా 2.30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు పోలింగ్ అనంతరం ఇళ్లకు వెళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి పొందిన అభ్యర్థి, ఒక ఏజెంట్‌ను మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతించాలన్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపును సాధ్యమైనంత త్వరగా, సాయంత్రం 6 గంటల లోపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించడంతో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు, ఇతర వివరాలను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌తో పాటు జిల్లా స్థాయిలో రూపొందించిన గూగుల్ ఫారం లోఎటువంటి తప్పులు లేకుండా వేగంగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. డేటా ఎంట్రీ చేసిన వివరాలను మరొక అధికారి ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేయించి, సంతకం తీసుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సిఈఓ లక్ష్మణరావు, డిపిఓ రవికుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.