బొల్లారం డివిజన్ లో మహిళా అదృశ్యం
జిన్నారం :బొల్లారం డివిజన్ లోని కేబీఆర్ కాలనీకి చెందిన 33 ఏళ్ల మానసిక దివ్యాంగురాలు అదృశ్యమైన ఘటన ఐడీఏ బొల్లారం డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆమె ఆచూకీ కోసం వివరాలు వెల్లడించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేబీఆర్ కాలనీకి చెందిన కలాల్ సావిత్రి (65) చిన్న కుమార్తె చంద్రకళ (33) పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. తల్లితో కలిసి నివసిస్తున్న ఆమె నవంబర్ 24న సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆమె జాడ తెలియలేదు. అదృశ్యమైన సమయంలో చంద్రకళ ఎరుపు రంగు నైట్‌డ్రెస్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఎత్తు సుమారు 5.3 అడుగులు కాగా, ఛాయ నలుపు-గోధుమ రంగులో ఉంటుందని పేర్కొన్నారు. చంద్రకళ ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా ఐడీఏ బొల్లారం డివిజన్ సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వి.సుధీర్ కుమార్ కోరారు.