‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ లక్ష్యం యువత చేతిలోనే ఉంది: కిషన్ రెడ్డి
హైదరాబాద్, సూర్య ప్రతినిధి: ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ (నషా ముక్త్ భారత్) లక్ష్యం నెరవేరాలంటే అది దేశ యువత చేతిలోనే ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం హైదరాబాద్‌లో ఆయన చేపట్టిన మూడు రోజుల ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర ముగింపు సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
తన పాదయాత్ర పూర్తిగా రాజకీయాలకు అతీతంగా సాగిందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, సినీ ప్రముఖులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలిపారని కిషన్ రెడ్డి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందన్న పూర్తి నమ్మకం తనకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న దేశ యువత మత్తుపదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.