*ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా? జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు*
కోహెడ;ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన “మన బడి – మన హక్కు” కార్యక్రమంలో భాగంగా కోహెడ మండలం తంగళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏఐవైఎఫ్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని వంట కార్మికులకు సూచించారు.అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడగా, గత విద్యా సంవత్సరంలో మూడు నెలల వేతనాలు చెల్లించలేదని, ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వేతనాలు అందలేదని వారు వెల్లడించారు. దీంతో దాదాపు తొమ్మిది నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్న కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. దాదాపు తొమ్మిది నెలలుగా వేతనాలు అందకపోతే పారిశుద్ధ్య కార్మికులు, వారి కుటుంబాలు ఎలా జీవించాలి వారి పిల్లల చదువులు, కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని ప్రశ్నించారు. ఈ సమస్యకు కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, జిల్లా మరియు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా విభాగం సంబంధిత అధికారులు, రాష్ట్రస్థాయి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ చేసే అధికారులు, అదే పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పాఠశాలల పరిశుభ్రత కావాలి కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచే కార్మికుల బతుకులు మాత్రం పట్టించుకోరా? ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేసే కార్మికులకు కనీస వేతన భద్రత కల్పించలేని అధికారులు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నట్లు? అని ప్రశ్నించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ సమస్యపై సమీక్ష నిర్వహించి, పెండింగ్ వేతనాల వివరాలను సేకరించి రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు, సమగ్ర శిక్షా అధికారులు తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయడంతో పాటు కార్మికుల బకాయి వేతనాలు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తే ఏఐవైఎఫ్ చూస్తూ ఊరుకోదని, జిల్లా మరియు రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు చిత్యాల శేఖర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కందుకూరి మహేష్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.