ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా యెల్లంల సంజీవరెడ్డి
*ప్రజాసేవకు గుర్తింపు.. పార్టీ బలోపేతానికి మరో బాధ్యత*
*నియామక పత్రం అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య*
మోటకొండూర్, మేజర్ న్యూస్:
ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న యెల్లంల సంజీవరెడ్డికి కీలక బాధ్యత దక్కింది. ఆలేరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయనను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, ప్రజలతో మమేకమై పనిచేస్తున్న తీరుకు ఈ నియామకం గుర్తింపుగా నిలిచింది.
మోటకొండూర్ మండలం చామాపూర్ గ్రామానికి చెందిన యెల్లంల సంజీవరెడ్డి ప్రజా జీవితంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతుగా ముందుకు వస్తూ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తన సొంత నిధులతో పలు గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, ఎన్నోఅభివృద్ధి పనులు చేయడం ద్వారా ప్రజల భాగస్వామిగా నిలిచారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న సంజీవరెడ్డికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పార్టీ శ్రేణుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
శుక్రవారం ఆలేరు పట్టణంలో మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంజీవరెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంజీవరెడ్డికి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలతో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ఆయన కృషి చేస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజాసేవను రాజకీయ బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న సంజీవరెడ్డికి ఈ నియామకం మరో కీలక మైలురాయిగా నిలవనుంది. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందాలని స్థానిక నాయకులు ఆకాంక్షిస్తున్నారు.