ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: చిన్న చిత్రంగా థియేటర్లలో విడుదలైన తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మయూఖ ఇప్పుడు డిజిటల్ వేదికలపై అనూహ్య ఆదరణతో దూసుకుపోతోంది. పాయల్ చెంగప్ప, దేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందుతూ టాప్ ట్రెండింగ్ జాబితాలో నిలిచింది.
శ్రీ తేజ్ ఎస్‌కే దర్శకత్వంలో శశిధర్ నల్ల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల వద్ద పరిమిత స్థాయిలో ప్రచారం జరిగినప్పటికీ, ఓటీటీలో విడుదలైన తర్వాత మౌత్ టాక్ ద్వారా థ్రిల్లర్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది. విడుదలకంటే ముందే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ మిస్టరీ చిత్రంగా పురస్కారం దక్కించుకోవడం ఈ సినిమా ప్రత్యేకత.
కథాంశం విషయానికి వస్తే, నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తూ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే మయూఖ అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నగరంలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు జరుగుతున్న సమయంలో, ఆమె నివసించే ఇంట్లోనూ వింత ఘటనలు చోటుచేసుకుంటాయి. తనకు తెలియకుండా ఇంట్లో ఎవరో దాక్కుని ఉంటున్నారన్న అనుమానం, ఆ తర్వాత జరిగే ఊహించని పరిణామాలు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తాయి.
మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బర, అమన్ మసూద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ పొందింది. ఉత్కంఠభరితమైన కథనం, అనూహ్య మలుపులతో సాగే మయూఖ ప్రస్తుతం ఓటీటీ వీక్షకులకు మంచి థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తూ చర్చనీయాంశంగా మారింది.
Also Read: వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు