అలియాస్ రుక్మిణి నా కెరీర్‌లో బెస్ట్ సినిమా.. ట్రైలర్ లాంచ్‌లో హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న విభిన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అలియాస్ రుక్మిణి థియేట్రికల్ ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తుండగా, దీప్తి గంటా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నితిన్ మాట్లాడుతూ, అలియాస్ రుక్మిణి తన కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కొన్ని చిత్రాలను కమర్షియల్ లెక్కలు వేసుకుని చేశానని, కానీ తొలిసారి ఎలాంటి లెక్కలు లేకుండా కథ నచ్చి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇదని నితిన్ తెలిపారు. పాటలు, ఫైట్లు, డాన్సులు వంటి అంశాలను పక్కన పెట్టి కేవలం కంటెంట్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను చేశానని చెప్పారు. నిర్మాత దీప్తి గంటా ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్ అని, ప్రతి విభాగంలో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను జాగ్రత్తగా చూసుకున్నారని ప్రశంసించారు. అలాగే నాని ఈ సినిమాకు సీక్రెట్ సూపర్‌స్టార్ అని, తనపై నమ్మకం ఉంచి ఇలాంటి కంటెంట్ సినిమా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ గురించి నితిన్ మాట్లాడుతూ, ఒకే సన్నివేశంలో నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఆలోచింపజేసే తీరు చూస్తుంటే తెలుగు సినిమాకు ఆయన ఒక రాజ్‌కుమార్ హిరణిలా కనిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇష్క్ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాటలు ఈ చిత్రంలో కుదిరాయని, విజయ్ బుల్గానిన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని చెప్పారు. కథానాయిక ఆఫియా సయ్యద్ అద్భుతంగా నటించారని, ఈ సినిమాతో ప్రేక్షకులను తప్పకుండా సర్‌ప్రైజ్ చేస్తారని పేర్కొన్నారు.
ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసే కృష్ణ అనే మిడిల్ క్లాస్ యువకుడి జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రుక్మిణి అనే కలం పేరుతో అతను రాసే నవలలు బెస్ట్ సెల్లర్స్‌గా మారడం, ఆ రచనల వెనుక ఉన్న అసలు నిజం బయటపడిన తర్వాత ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో కథనం సాగుతుంది. జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, సృజన ఆడుసుమిల్లి ఎడిటింగ్‌తో పాటు హర్షవర్ధన్, సాయికుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: వృషకర్మలో ఛాలెంజింగ్ పాత్ర.. విజువల్స్ అద్భుతంగా ఉంటాయంటున్న మీనాక్షి చౌదరి