నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి
సూర్య - పెద్దపల్లి రూరల్: గ్రామ ప్రజల మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, నిమ్మనపల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామ సర్పంచ్ వేల్పుల రమేష్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షల కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన నిమ్మనపల్లిలో నిధుల కొరత కారణంగా వీధి దీపాల నిర్వహణ భారంగా మారిందని, విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ఎంపీ నిధులతో గ్రామంలోని వీధుల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రజల అవసరాల మేరకు ఎంపీ కోటా నుంచి నాలుగు కొత్త చేతి బోర్లు మంజూరు చేయాలని కోరారు.
గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమర్పించిన వినతులపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ సానుకూలంగా స్పందించి, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ వేల్పుల రమేష్ తెలిపారు.