క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం 70వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
సూర్య - పెద్దపల్లి: క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని, క్రమశిక్షణ, స్నేహభావం అలవడటంతో పాటు దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు దోహదపడతాయని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, ట్రినిటీ విద్యాసంస్థల అధినేత దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. 70వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 బాలబాలికల ఖోఖో పోటీలను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ షేక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుదల, జట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ శోభారాణి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేల్పుల సురేందర్, కార్యదర్శి దాసరి రమేష్, జావిద్, వెంకటేష్, కాజావి, బిట్ర శ్రీనివాస్, డాక్టర్ రవి, నవీన్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.