రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
సూర్య - పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి రోడ్డు భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ఆక్రమణలు తొలగించి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. రోడ్లపై పశువులను వదిలే వారిపై రూ.10 వేల జరిమానా విధించి, పశువులను గోశాలలకు తరలించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల వద్ద స్కూల్ జోన్ బోర్డులు, అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.అలాగే రహదారులపై రేడియం స్టిక్కర్లు, స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర జంక్షన్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.సమావేశంలో డీసీపీ రామ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.