స్పాట్ చరమగీతం పాడినట్టేనా...! -పీజీ స్పాట్ ప్రవేశాలకు మొక్షమెప్పుడో... -మిగిలిన సీట్ల భర్తీకి ఐసెట్ తరహాలో అడ్మిషన్లను చేపడతారా...!
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కూటమి సర్కార్ విద్యారంగాన్ని అస్తవ్యస్థం చేసింది. ఏపీపీజీసెట్-2026కు సంబంధించి పీజీ అడ్మిషన్ల ప్రక్రియ గత ఆరునెలలుగా నత్తనడకన నడుస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతల కౌన్సిలింగ్ ప్రక్రియను మాత్రమే పూర్తి చేశారు. ఇక స్పాట్ అడ్మిషన్లు చేపడతారా.. లేక మూడవ విడత ప్రవేశాలను కొనసాగిస్తారా...అన్న సందేహం విద్యార్థులలో నెలకొంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన పేద, గ్రామీణ, గిరిజన విద్యార్థులు అడ్మిషన్లు పొందలేక ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులకు సంబంధించిన సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, స్పాట్ అడ్మిషన్లు నిర్వహించకపోవడం వల్ల అర్హులైన విద్యార్థులకు నష్టం జరుగుతోంది. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేయడం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడమే కాకుండా, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవకాశం ఉంటుందని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-స్పాటు చరమగీతం పాడేసినట్టేనా....!
ఐసెట్-2028 ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే ఇక పలు పీజీ కోర్సుల ప్రవేశాలలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు చరమగీతం పాడేస్తారా అన్న సందేహం కలుగుతోంది. ఐసెట్ ప్రవేశాలలో రెండు విడతల కౌన్సిలింగ్ అనంతరం మిగిలి ఉన్న కన్వీనర్ కోటా సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించకుండా ఆయా కళాశాలలే ఖాలీలను భర్తీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇలానే పీజీసెట్లోనూ స్పాట్ లేకుండా ఆయా కళాశాలల పరిధిలో మిగిలిన సీట్లకు యాజమాన్య కోటా తరహాలో సీట్ల భర్తీకి కమిషనరేట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతి ఇస్తుందా అన్న అనుమానాలు విద్యార్థులలో వ్యక్తమవుతున్నాయి.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్