మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన
మచిలీపట్నం మేజర్ న్యూస్ : మురసు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి కృష్ణా జిల్లాలోని కర అగ్రహారం, కృతివెన్ను, మచిలీపట్నం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగానికి విద్యుత్ సరఫరా అందించే లైన్లు, స్తంభాలు, విద్యుత్ మార్పిడి పరికరాలను పరిశీలించి, తుఫాన్ కారణంగా వాటికి జరిగిన నష్టం, చేపట్టిన మరమ్మతు పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్వా రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో కీలకమైనందున దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్తంభాలు, మార్పిడి పరికరాల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు, ఆక్వా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తగిన రక్షణ చర్యలు పాటిస్తూ పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.