విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘త్రిశూల వ్యూహం’ కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ బాలికల కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కె.జి.వి. సరిత, పశ్చిమ డీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ వి.ఎస్.ఎన్. వర్మ, ఇన్‌స్పెక్టర్ పి. జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ భద్రత, రహదారి భద్రత, ప్రమాదాల నివారణ, మహిళలు, పిల్లల రక్షణ, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై చిన్నచిన్న వీడియోల ద్వారా విద్యార్థులకు వివరించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేహాస్పద లింకులు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టాలు అమలులో ఉన్నాయని, ఆపద సమయంలో 112 అత్యవసర నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. నేరరహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.