అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక
విజయవాడ మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ క్రీడా శిక్షకుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు విజయ్ కుమార్ గోగులమూడి మోడరన్ పెంటాథ్లాన్‌లో భాగమైన లేజర్ రన్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మోడరన్ పెంటాథ్లాన్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) తన కార్యాలయంలో విజయ్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. అంతర్జాతీయ పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో జూలై 10 నుంచి 12 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజయ్ ప్రతిభ కనబరిచారని, మహారాష్ట్రలోని నాసిక్‌లో అక్టోబర్ 4 నుంచి 6 వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ అసాధారణ ప్రతిభతో రాణించి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారని వివరించారు. నవంబర్ 11 నుంచి 17 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమాలో, ఫ్లెమింగో బీచ్ సమీపంలో జరగనున్న ఆసియా అంతర్జాతీయ లేజర్ రన్ పోటీల్లో విజయ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు, యువ నాయకుడు సిద్ధు, 83వ డివిజన్ టీడీపీ ఉపాధ్యక్షుడు పోకతోట శివకృష్ణ, బాషా, న్యాయవాదులు నసీమ, మల్లేశ్వరి తదితరులు విజయ్‌కు అభినందనలు తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.