ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం
విజయవాడ, మేజర్ న్యూస్ : ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. అర్హులైన యువత ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. మంగళవారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఇజ్రాయెల్ నర్సింగ్ ట్రైనింగ్ వర్క్‌షాప్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం అజయ్ కార్యక్రమంలో భాగంగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ మహిళలకు మూడు నెలలపాటు ఉచితంగా రెసిడెన్షియల్ నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా తొలి విడతలో 1,100 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇజ్రాయెల్‌లో నెలకు సుమారు రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 300 మందికి జర్మన్ భాషలో శిక్షణ అందించామని, వారికి జర్మనీలో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు గ్రూప్స్‌తో పాటు డీఎస్సీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీ ఉచిత శిక్షణ ద్వారా 400 మంది ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. పేద ప్రజల తలసరి ఆదాయం పెంచి, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా సాంఘిక సంక్షేమ శాఖ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఎస్సీ విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, ఐఏఎస్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి తేజ్ భరత్, ఐఏఎస్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్ జీఎం చెన్నయ్య, వివిధ జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, నర్సింగ్ అభ్యర్థులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.