ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ
విజయవాడ, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో సాంకేతిక అక్రమాలు, ఆర్థిక అవకతవకలు, ఆదాయ నష్టాలను అరికట్టడంతో పాటు పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ, సంస్థ ప్రధాన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం తొలి విడత శిక్షణ ప్రారంభమైంది. ఈ విడతలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది డిపో మేనేజర్లు పాల్గొన్నారు. నవంబర్ 10, 11 తేదీల్లో తొలి విడత శిక్షణ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివప్రసాద్, ఐఎఫ్‌ఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి, (ఇంజినీరింగ్) జి.వి. రవివర్మతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరై డిపో మేనేజర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేఎండీ శివప్రసాద్ మాట్లాడుతూ సంస్థ ఆదాయాన్ని కాపాడటం, ప్రతి విభాగంలో పారదర్శకతను పాటించడం, విధుల నిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంపొందించడం ప్రతి డిపో మేనేజర్ బాధ్యత అని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా తలెత్తే అక్రమాలను గుర్తించడం, ఆదాయ లీకేజీలను అరికట్టడం, రికార్డులు, ఆర్థిక లావాదేవీలను క్రమం తప్పకుండా పరిశీలించడం, సంబంధిత విభాగాల మధ్య సమన్వయం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శిక్షణలో సిబ్బంది వ్యవహారాలు, అకౌంట్స్, మెకానికల్, ఆపరేషన్స్, కమర్షియల్/లాజిస్టిక్స్, ఐటీ తదితర విభాగాలకు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు, నిపుణులు డిపో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, రికార్డుల నిర్వహణ, తనిఖీ విధానాలు, లోపాల గుర్తింపు, నివారణ చర్యలపై ప్రాయోగిక అవగాహన కల్పిస్తున్నారు. నవంబర్ 10 నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో ఈ శిక్షణ నిర్వహించనున్నారు. తొలి విడతలో 30 మంది, రెండో విడతలో 27 మంది, మూడో విడతలో 34 మంది, నాలుగో విడతలో 34 మంది చొప్పున మొత్తం 125 మంది డిపో మేనేజర్లు శిక్షణ పొందనున్నారు. ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ పాణి చక్రతేజ పర్యవేక్షణలో, అకాడమీ సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. సంస్థలో ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయడం, సాంకేతిక అక్రమాలను నియంత్రించడం, ఆదాయాన్ని పరిరక్షించడం, డిపోలను సమర్థంగా నిర్వహించేందుకు మేనేజర్లకు అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్. బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.