సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు
హసన్ పర్తి, మేజర్ న్యూస్, వర్ధన్నపేట నియోజకవర్గం, హసన్ పర్తి మండలం, సీతంపేట గ్రామంలో నేతగాని కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ బతుకమ్మ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కే.ఆర్. నాగరాజు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.గ్రామంలోకి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు నేతగాని కులస్తులు, గ్రామ ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఇరువురూ బతుకమ్మలను తమ నెత్తిన ఎత్తుకొని స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా అడుగులు వేశారు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకల్లో వారు ప్రజలతో మమేకమై పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కులవృత్తుల సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుంటూ, ఏళ్ల తరబడి ఈ వినూత్న సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతగాని కుల సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
రిపోర్టర్ ;రాజ్ కుమార్ , హనుమకొండ, హనుమకొండ జిల్లా