గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు..
అమలాపురం మేజర్ న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తమ సందేహాలను శిక్షణా కార్యక్రమంలోనే నివృత్తి చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు సూచించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు విధానం, కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల నిర్వహణ, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తి అవగాహనతో వ్యవహరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని, పకడ్బందీ కార్యాచరణతో ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ తదితర ఎన్నికల ప్రక్రియలపై రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అభ్యర్థులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించాలని తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులకు కేటాయించిన ఎన్నికల గుర్తుల వివరాలను ముందుగానే తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా ఓటర్లు తమకు కేటాయించిన గుర్తులను సులభంగా గుర్తించేలా అవగాహన కల్పించాలని, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేసి ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కె. శాంతి కుమారి,రామచంద్రపురం డి ఎల్ డి వో అబ్రహం లింకన్,బి. వి. ఎస్. సి పోలిశెట్టి పి ఎస్ హెచ్ ఎం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎం. మురళీకృష్ణ, జిల్లా మాస్టర్ ట్రైనర్ ఎం వి రాంబాబు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు